IND vs PAK | సూపర్‌8.. పాక్‌పై భారత్‌ ఎనిమిదో విజయం

Feb 18, 2026 - 19:29
 0  0
IND vs PAK | సూపర్‌8.. పాక్‌పై భారత్‌ ఎనిమిదో విజయం
Ishan Kisan
  • ప్రపంచకప్‌లో అప్రతిహత రికార్డు ఇషాన్‌ కిషన్‌ విజృంభణ
  • బౌలర్ల సమష్టి ప్రదర్శన టీమ్‌ఇండియాకు సూపర్‌-8 బెర్తు

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ దుమ్మురేపింది! ప్రియమైన ప్రత్యర్థి పాకిస్థాన్‌పై బెబ్బులిలా విరుచుకుపడింది. సండే బ్లాక్‌బస్టర్‌లో టీమ్‌ఇండియా పాక్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. మెగాటోర్నీలో తమ అజేయ రికార్డును అప్రతిహతంగా కొనసాగిస్తూ ఏకంగా ఎనిమిదోసారి విజయఢంకా మోగించి..మరో మ్యాచ్‌ మిగిలుండగానే సూపర్‌-8 బెర్తు ఖరారు చేసుకుంది. కొలంబో గడ్డ మీద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. ప్యాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ ధనాధన్‌ అర్ధసెంచరీతో చెలరేగిన వేళ పోరాడే స్కోరు అందుకున్న టీమ్‌ఇండియా సమష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. పాక్‌ బౌలర్లను ఉతికిఆరేస్తూ కిషన్‌ బౌండరీలతో శివతాండవం చేశాడు. బుమ్రా, హార్దిక్‌ పాక్‌ను ఆదిలోనే దెబ్బతీయగా, అక్షర్‌, వరుణ్‌ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. వీరి ధాటికి 114 పరుగులకే కుప్పకూలిన పాక్‌ 61 పరుగుల తేడాతో మట్టికరించింది. హ్యాట్రిక్‌ విజయాలతో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ టాప్‌ గేర్‌లో దూసుకెళుతుండగా, పాక్‌ సూపర్‌-8 ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి.

IND vs PAK |కొలంబో: ఫార్మాట్‌ ఏదైనా ప్రపంచకప్‌ టోర్నీల్లో దాయాది పాకిస్థాన్‌కు చుక్కలు చూపెట్టే టీమ్‌ఇండియా.. ఆ సంప్రదాయాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ మరోసారి విజయ దుందుభి మోగించింది. ఇరుజట్ల మధ్య కొలంబో ఆతిథ్యమిచ్చిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో భారత్‌.. 61 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థిని మట్టికరిపించి సూపర్‌-8 బెర్తును ఖరారు చేసుకుంది. అదీగాక ఐసీసీ టీ20 టోర్నీల్లో పాక్‌పై భారత ఆధిపత్యాన్ని 8-1కు పెంచుకుంది. మ్యాచ్‌లో పాక్‌ ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా..

ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 77, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌కు తోడు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (29 బంతుల్లో 32, 3 ఫోర్లు) నిలకడైన ఆటతో 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 175 రన్స్‌ చేసింది. ఛేదనలో భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో పాక్‌ 18 ఓవర్లకు 114 రన్స్‌కు తోకముడిచింది. ఉస్మాన్‌ ఖాన్‌ (34 బంతుల్లో 44, 6 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా షాహిన్‌ అఫ్రిది (19 బంతుల్లో 23 నాటౌట్‌, 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆడకుంటే ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. హార్ధిక్‌ (2/16), బుమ్రా (2/17), వరుణ్‌ (2/17), అక్షర్‌ (2/29) తలా రెండు వికెట్లు పడగొట్టి పాక్‌ పనిపట్టారు. ఇషాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.

పవర్‌ ప్లేలోనే ఖేల్‌ ఖతం..

ఇషాన్‌ మినహా మిగిలిన భారత బ్యాటర్లు ఆచితూచి ఆడిన పిచ్‌పై పాక్‌ బ్యాటర్లు ఎలా స్పందిస్తారు? అన్న ఉత్కంఠకు తొలి మూడు ఓవర్లలోనే తెరపడింది. పవర్‌ ప్లేలోనే పాక్‌ ఓటమి దాదాపుగా ఖాయమైంది. హార్ధిక్‌, బుమ్రా, అక్షర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆ జట్టు తొలి 6 ఓవర్లలో టాపార్డర్‌ను కోల్పోయి ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. హార్ధిక్‌ తొలి ఓవర్లోనే ప్రమాదకర సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను డకౌట్‌ చేసి పాక్‌ పతనానికి శ్రీకారం చుట్టాడు. రెండో ఓవర్‌లో బంతినందుకున్న బుమ్రా.. ఐదు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు పడగొట్టి దాయాదిని చావుదెబ్బ కొట్టాడు.

రెండో బంతికి అయూబ్‌ (6)ను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో వికెట్ల ముందు బలిగొన్న అతడు.. ఆఖరి బంతికి కెప్టెన్‌ సల్మాన్‌ (4)ను బోల్తా కొట్టించాడు. ఐదో ఓవర్‌లో అక్షర్‌.. బాబర్‌ ఆజమ్‌ (5)ను క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో ఆ జట్టు పవర్‌ ప్లేలో 38/4తో నిలిచింది. ఈ క్రమంలో పాక్‌ను కీపర్‌ ఉస్మాన్‌ ఆదుకునే యత్నం చేశాడు. దూకుడుగా ఆడుతూ భారత స్పిన్నర్లను ఎదుర్కున్న అతడు.. షాదాబ్‌ ఖాన్‌ (14)తో కలిసి ఐదో వికెట్‌కు 39 రన్స్‌ జోడించాడు. కానీ అక్షర్‌ 11వ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌ అయ్యాడు. అంతే..! ఆ తర్వాత పాక్‌ లోయరార్డర్‌ తోకముడవడానికి పెద్దగా టైమ్‌ పట్టలేదు.

ఇషాన్‌దార్‌ ఇన్నింగ్స్‌

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. పాక్‌ పనిపడతాడనుకున్న అభిషేక్‌ శర్మ వికెట్‌ను ఫస్ట్‌ ఓవర్లోనే కోల్పోయింది. పాక్‌ సారథి వేసిన తొలి ఓవర్‌ ఆఖరి బంతిని పుల్‌ చేయబోయి మిడాన్‌లో అఫ్రిదికి చిక్కాడు. అభిషేక్‌ గండాన్ని తప్పించుకున్నామని సంబురపడ్డ పాక్‌ ఆశలపై ఇషాన్‌ నీళ్లు చల్లాడు. షాహిన్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో వేట ఆరంభించిన అతడు.. అబ్రర్‌ ఐదో ఓవర్లో 6, 4 బాదాడు. అతడే వేసిన ఏడో ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లతో అతడి అర్ధశతకం కూడా పూర్తయింది.

దూకుడుగా ఆడే క్రమంలో ఇషాన్‌ను 9వ ఓవర్లో అయూబ్‌ బౌల్డ్‌ చేయడంతో 87 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఇషాన్‌ నిష్క్రమణ తర్వాత భారత స్కోరు వేగం తగ్గింది. పాక్‌ సారథి వరుసగా స్పిన్నర్లతో వేయించి టీమ్‌ఇండియా భారీ స్కోరుకు అడ్డుకట్ట వేయగలిగాడు. తిలక్‌, సూర్య క్రీజులో ఉన్నా సింగిల్స్‌, డబుల్స్‌కే పరిమితమయ్యారు. అయూబ్‌ ఒకే ఓవర్లో తిలక్‌, హార్ధిక్‌ను ఔట్‌ చేసి షాకిచ్చినా ఆఖర్లో శివమ్‌ దూబె (17 బంతుల్లో 27, 3 ఫోర్లు, 1 సిక్స్‌), రింకూ సింగ్‌ (11) మెరుపులతో భారత్‌ 170 పరుగుల మార్కును దాటేసింది.

India

నీలి సముద్రంలా!

భారత్‌, పాక్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. అసలు పోరు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు పటాపంచలు చేస్తూ ఐసీసీ ప్రయత్నాలు సఫలం కాగా, ఫ్యాన్స్‌ సండే బ్లాక్‌బాస్టర్‌ను ఆస్వాదించారు. మ్యాచ్‌కు వేదికైన ప్రేమదాస స్టేడియానికి ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. స్టేడియంలో ఎటు చూసినా టీమ్‌ఇండియా జెర్సీలు ధరించిన అభిమానులు వేల సంఖ్యలో ఉండటంతో నీలి సముద్రాన్ని తలపించింది. మెగాటోర్నీకి బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్న రోహిత్‌శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కప్‌ను స్టేడియంలో తీసుకొచ్చిన హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌తో సందడి చేశాడు. తన భార్య రితికా సజ్దేతో కలిసి వచ్చిన రోహిత్‌…ఐసీసీ చైర్మన్‌ జైషా, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌, ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లాతో కలిసి మ్యాచ్‌ వీక్షించాడు.

India Vs Pakistan

నో షేక్‌హ్యాండ్‌

భారత్‌, పాకిస్థాన్‌ మెగా పోరులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గతంలో లాగే ఇరు జట్ల కెప్టెన్లు సూర్యకుమార్‌ యాదవ్‌, సల్మాన్‌అలీ ఆగా పాత సంప్రదాయాన్నే కొనసాగించారు. మ్యాచ్‌కు ముందు టాస్‌ వేసే సమయంలో కనీసం ఒకరిని ఒకరు చూసుకోని కెప్టెన్లు షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోకుండానే వెనుదిరిగారు. ఇటీవల జరిగిన ఆసియాకప్‌లోనూ రెండు దేశాల సారథులు ఇదే ఒరవడి కొనసాగించారు. టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆగా..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ప్లేయర్లు కరచాలనం లేకుండానే డగౌట్‌కు చేరుకున్నారు.

18 టీ20 ప్రపంచకప్‌లో 18 ఓవర్లు స్పిన్‌ బౌలింగ్‌ చేయడం ఇదే తొలిసారి పాక్‌ స్పిన్నర్లు భారత్‌పై ఈ ఫీట్‌ నమోదు చేశారు.

1 టీ20 వరల్డ్‌ కప్‌లో ఆరుగురు స్పిన్నర్లు ఒక మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడం ఇదే తొలిసారి

16 ఐసీసీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో 16 మ్యాచ్‌లాడిన భారత్‌ అన్నింటా వరుస విజయాలు సాధించింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి టీమ్‌ఇండియాకు చివరిది.

సంక్షిప్త స్కోర్లు:

భారత్‌: 20 ఓవర్లకు 175/7 (ఇషాన్‌ 77, సూర్య 32, అయూబ్‌ 3/25, అఘా 1/10);

పాకిస్థాన్‌: 18 ఓవర్లకు 114 ఆలౌట్‌ (ఉస్మాన్‌ 44, షాహిన్‌ 23, హార్ధిక్‌ 2/16, బుమ్రా 2/17)

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0