Indian Student | అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి.. యూనివర్సిటీ సమీపంలోని అడవిలో డెడ్‌బాడీ లభ్యం

Feb 18, 2026 - 19:30
 0  0
Indian Student | అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి.. యూనివర్సిటీ సమీపంలోని అడవిలో డెడ్‌బాడీ లభ్యం
Saketh Srinivasaiah

Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. యూనివర్సిటీకి కిలోమీటర్‌ దూరంలోని అటవీ ప్రాంతంలో సాకేత్‌ శ్రీనివాసయ్య (22) మృతదేహం లభించింది. ఈ విషయాన్ని అమెరికాలో పోలీసులు వెల్లడించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సాకేత్‌ శ్రీనివాసయ్య ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు. బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 9వ తేదీన అతను కనిపించకుండా పోయాడు. సాకేత్‌ స్నేహితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.సాకేత్‌ను చివరిసారిగా క్యాంపస్‌కు కిలోమీటర్‌ దూరంలో ఉన్న బర్కిలీ హిల్స్‌లోని లేక్‌ అంజా సమీపంలో కనిపించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. అక్కడి సమీపంలోనే అతని పాస్‌పోర్టు, ల్యాప్‌టాప్‌ ఉన్న బ్యాగ్‌ను గుర్తించారు. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలో అతని మృతదేహం లభ్యమైంది.

సాకేత్‌ మృతిపై భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. సాకేత్‌ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో సాకేత్‌ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసానిచ్చింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0