TGIIC | పరిశ్రమల భూములకు రెక్కలు!.. 12 శాతం వరకు ధరలు పెంచాలని నిర్ణయం?

Feb 18, 2026 - 19:30
 0  0
TGIIC | పరిశ్రమల భూములకు రెక్కలు!.. 12 శాతం వరకు ధరలు పెంచాలని నిర్ణయం?
Tgiic
  • ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న టీజీఐఐసీ
  • ఏప్రిల్‌ నుంచి కొత్త రేట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల కోసం కేటాయించిన భూముల ధరలకు త్వరలో రెక్కలు రాబోతున్నాయి. పెట్టుబడులను ఆకట్టుకోవడానికి, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు రాష్ట్ర సర్కార్‌ తక్కువ ధరకే భూములను కేటాయించకుండా.. ఏకంగా ధరలు పెంచడానికి సమాయత్తమవుతున్నట్టు తెలుస్తున్నది. వచ్చే రెండు నెలల్లో పరిశ్రమల భూముల ధరలు 10 శాతం నుంచి 12 శాతానికి పెంచేయోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం టీజీఐఐసీ నూతన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నది. ఈ ప్రణాళికలకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పెంపు ధరలు అమల్లోకి రానున్నాయి.

ఇప్పటికే పారిశ్రామిక రంగంలో స్తబ్ధత కొనసాగుతుండగా, మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా టీజీఐఐసీ భూముల ధరలను పెంచాలని నిర్ణయించడం పరిశ్రమ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. ఒకవైపు పొరుగు రాష్ర్టాలు పెట్టుబడులను ఆకర్శించడానికి ఎకరానికి 99 పైసల చొప్పున కేటాయిస్తుంటే..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే అధికంగా ఉన్న ధరలను మరింత పెంచాలని నిర్ణయించడం విశేషం.

హైదరాబాద్‌ కంటే బెంగళూరు, గురుగ్రామ్‌ల్లో తక్కువ ధరకే పరిశ్రమలకు భూ కేటాయింపులు జరుపుతున్నారు. కానీ, ఇక్కడ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంతో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడం లేదు. ఉన్న సంస్థలు కూడా తట్టాబుట్ట సర్దుకొని వెళ్లిపోవాలని చూస్తున్నాయి. సైబరాబాద్‌, శంషాబాద్‌, పటాన్‌చెరు, యాదాద్రి, మేడ్చల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ తదితర జోన్ల పరిధిలోని 170 ఇండస్ట్రియల్‌ పార్క్‌లలో భూముల ధరలు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

ఆకాశాన్నంటుతున్న భూముల ధరలు

టీజీఐఐసీ పరిశ్రమలకు కేటాయిస్తున్న భూముల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని గద్వాల్‌లో ఎకరం భూమి రూ.1.10 కోట్లుగా ఉండటం విశేషం. రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో రూ.5 కోట్లు కాగా, సీతారాంపూర్‌, చందన్‌వల్లిలో రూ. 3 కోట్లు, పటాన్‌చెరులో రూ. 6 కోట్లు, రామగుండంలో రూ. 4.5 కోట్లు, నిజామాబాద్‌లో రూ. 6.3 కోట్లుగా ధర నిర్ణయించారు. ఓ వైపు సబ్సిడీలు ఇవ్వకపోగా, మరోవైపు ధరలు సైతం ఇతర రాష్ర్టాలకన్నా ఎంతో అధికంగా ఉండటం పెట్టుబడులకు అవరోధంగా మారినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. రైతుల వద్ద మార్కెట్‌ ధరకు భూములు సేకరించి, వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ‘నో ప్రాఫిట్‌.. నో లాస్‌’ పద్ధతిలో మాత్రమే పరిశ్రమలకు భూములు విక్రయిస్తున్నట్లు టీజీఐఐసీ చెబుతున్నది. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

బహిరంగ మార్కెట్‌లో ధరలకు, టీజీఐఐసీ విక్రయిస్తున్న ధరలకు పొంతన లేకుండాఉందని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. టీజీఐఐసీ వద్ద భూములు కొనుగోలు చేసేకన్నా సొంతంగా రైతుల నుంచి కొనుగోలు చేయడం మేలని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. మన రాష్ట్రంలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం విదితమే. దీంతో కాంగ్రెస్‌ సర్కార్‌ రెండేండ్ల్లలో ఒక్క నూతన పారిశ్రామికవాడను కూడా ఏర్పాటు చేయకపోగా, గత బీఆర్‌ఎస్‌ అభివృద్ధిచేసిన ఇండస్ట్రియల్‌ పార్కుల్లోని ప్లాట్ల ధరలను పెంచాలని నిర్ణయించడం విమర్శలకు తావిస్తున్నది.

ఎంవోయూలతో సరి..కార్యాచరణ లేదు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓ వైపు రియల్‌ ఎస్టేట్‌ రంగం మందగమనంలో కొనసాగుతుంటే, మరోవైపు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలు సైతం పునరాలోచనలో పడుతున్నాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న అనేక కంపెనీలు ఇంతవరకు మరో ముందడుగు వేయకపోవడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. అంతేకాదు, మన రాష్ట్రంలో రెండేండ్లుగా పరిశ్రమలకు సబ్సిడీలు కూడా విడుదల కాకపోవడంతో పలు సంస్థలు రాష్ర్టాన్ని వీడాయి. వీటిలో కేన్స్‌ సెమికాన్‌ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినప్పటికీ, గుజరాత్‌ ప్రభుత్వం ఎక్కువగా ప్రోత్సాహకాలు ఇవ్వడంతో అక్కడికి తరలిపోయిన విషయం తెలిసిందే.

ప్రోత్సాహకాలతో పొరుగు రాష్ర్టాలు..

ఇదిలావుంటే, ఇప్పటికే రాష్ట్రంలోని పారిశ్రామిక భూముల ధరలు గరిష్ఠ స్థాయిలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలనుంచి ఉన్న పోటీని తట్టుకొని పెట్టుబడులను ఆకర్షించేందుకు నామమాత్రంగా 99 పైసలకే ఎకరం చొప్పున భూములు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను రాష్ర్టానికి రాబట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్‌ హబ్‌(లిఫ్ట్‌) పేరుతో సరికొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ 2029 వరకు అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే హైదరాబాద్‌-అమరావతి వయా కర్నూల్‌, తిరుపతి-విజయవాడ-బెంగళూరు, విజయవాడ-వైజాగ్‌ తదితర మార్గాల్లో పెద్ద ఎత్తున పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తూ రాయితీలను ప్రకటిస్తున్నది.

ముఖ్యంగా ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలు స్వరాష్ర్టానికి తరలిరావాలని కోరుతున్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కూడా ఉండటంతో రాయితీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పారిశ్రామికవేత్తలు ఏపీవైపు మొగ్గుచూపుతున్నారు. అలాగే, ఐటీ రంగంలో మన రాష్ర్టానికి పోటీ ఇస్తున్న కర్ణాటకలో సైతం భూములు ఇక్కడికన్నా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు బెంగళూరు నుంచి 30-60 కిలోమీటర్ల పరిధిలో ఎకరం ధర రూ. 1-2 కోట్ల వరకు ఉంది. అయితే తెలంగాణ తరహాలోనే కర్ణాటకలో కూడా రాయితీలు సకాలంలో విడుదల చేయడంలేదని, అయినప్పటికీ భూముల ధరలు మన రాష్ట్రంతో పోల్చుకుంటే ఎంతో తక్కువగా ఉండటంవల్ల బెంగళూరు ప్రత్యామ్నాయంగా మారుతున్నదని చెబుతున్నారు.

ఏపీ, కర్ణాటకలో పరిశ్రమల భూముల ధరల వివరాలు..

ఏపీలో ‘లిఫ్ట్‌’ పాలసీ ప్రకారం ఎకరం ధర 99 పైసలు
బెంగళూరు రూరల్‌(సోంపుర ఏరియా)లో ఎకరం ధర రూ. 1.85-2 కోట్లు
బెంగళూరుకు 60 కి.మీ.ల దూరంలో ఉన్న అవ్వెరహల్లిలో ఎకరం ధర రూ. 1.50 కోట్లు
బెంగళూరు నుంచి 48 కి.మీ.ల దూరంలో ఉన్న రామనగర్‌లో ఎకరం రూ. 1.17కోట్లు
బెంగళూరు నుంచి 65 కి.మీ.ల దూరంలోని కోలార్‌లో ఎకరం రూ. 1.71కోట్లు
బెంగళూరు నుంచి 30 కి.మీ.ల దూరంలోని నరసపురలో ఎకరం రూ. 2.00కోట్లు

తెలంగాణలో పారిశ్రామిక భూముల ధరలు..

హైటెక్‌సిటీ మాదాపూర్‌ లేఔట్‌లో రూ.65.27 కోట్లు
నానక్‌రాంగూడ-ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఎకరం ధర రూ. 62.55 కోట్లు
గచ్చిబౌలి ఇండస్ట్రియల్‌ పార్క్‌లో రూ.62.55 కోట్లు
మణికొండ ఐటీ పార్క్‌లో రూ.59.83 కోట్లు
చందూలాల్‌ బారాదరి ఇండస్ట్రియల్‌ పార్క్‌లో రూ.20.46 కోట్లు
కాటేదాన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో రూ. 15.00 కోట్లు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0