మేయర్‌ కుర్చీ ‘సీపీఐ’కే

Feb 18, 2026 - 19:29
 0  0
మేయర్‌ కుర్చీ ‘సీపీఐ’కే
Khammam1
  • నేడు ‘కొత్తగూడెం కార్పొరేషన్‌’ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక
  • ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పర్యవేక్షించిన భద్రాద్రి అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌
  • ఉదయం 11 గంటలకు ఎన్నిక.. ఆ తర్వాత ప్రమాణ స్వీకారాల ప్రక్రియ..

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (కేజీఎంసీ) మేయర్‌ పీఠం సీపీఐ దక్కించుకుంది. 60 డివిజన్లున్న కేజీఎంసీలో కాంగ్రెస్‌, సీపీఐ పార్టీలు చెరో 22 డివిజన్లు గెలవడంతో ఆ రెండు పార్టీల పెద్దలు శనివారం అర్ధరాత్రి ఒక నిర్ణయానికి వచ్చి మేయర్‌ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా ఒప్పందం చేసుకున్న విషయం విదితమే. దీంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల లాంఛనం కానుంది. సోమవారం ఉదయం 11 గంటలకు కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, విద్యాచందన, కేజీఎంసీ కమిషనర్‌ సుజాత సమక్షంలో కార్పొరేటర్లు మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. చేతులు ఎత్తే పద్ధతిలో ఈ ఎన్నిక జరుగుతుంది.

రెండు రోజులుగా కుస్తీ పట్టి..
కేజీఎంసీలోని 60 డివిజన్లకు ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 31 స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ మేయర్‌ పీఠాన్ని అధిష్టించాల్సి ఉంది. కానీ ఇందులో ఏ పార్టీకి కూడా 31 స్థానాలు రాలేదు. కాంగ్రెస్‌, సీపీఐలకు చెరో 22 స్థానాలు, బీఆర్‌ఎస్‌కు 8, సీపీఎంకు ఒకటి, బీజేపీకి ఒకటి, స్వతంత్రులకు ఆరు చొప్పున స్థానాలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ రెండు రోజులుగా కుస్తీ పట్టి సీపీఐతో చర్చలు జరుపుకుంది. చివరికి ఈ రెండు పార్టీల నేతలు కలిసి ఒక అవగాహనకు వచ్చారు. చెరో రెండున్నరేళ్లు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలను తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో తొలి రెండున్నరేళ్లు మేయర్‌ పీఠాన్ని సీపీఐ అధిష్టించనుంది.

కాంగ్రెస్‌, సీపీఐ మధ్య సర్దుబాట్లు పూర్తికావడంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రశాంతంగా జరిగే అవకాశాలున్నాయి. దీంతోపాటు ఆరు స్వతంత్రుల్లో ఐదుగురు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్‌ బలం 28కి చేరింది. దీంతోపాటు కో ఆప్షన్‌ మెంబర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉండడంతో మేయర్‌, డిప్యూటి మేయర్‌తోపాటు కార్పొరేటర్ల ప్రమాణస్వీకారాలు అయ్యాక ఆ మెంబర్లను ఎంపిక చేసుకుంటారు. కాంగ్రెస్‌, సీపీఐ అభ్యర్థులు తమ పార్టీల గుర్తులపై గెలవడంతో ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు జిల్లా నాయకత్వానికి విప్‌ అధికారాలు కూడా ఇచ్చారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినా విప్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అధిష్టానం నుంచి ప్రతిపాదన పంపిన వారినే మేయర్‌, డిప్యూటి మేయర్‌లను ఎంపిక చేయనున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0