నేడు ప్రమాణస్వీకారం

Feb 18, 2026 - 19:29
 0  0
నేడు ప్రమాణస్వీకారం
26
  • ఉదయం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  •  పలుచోట్ల చైర్మన్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న సస్పెన్స్‌
  • వైస్‌ చైర్మన్ల అభ్యర్థుల ఎన్నికపై రాని స్పష్టత
  • నేడు నేరుగా సీల్డ్‌ కవర్లలో పేర్లు వస్తాయంటున్న నేతలు
  • కోరం లేకపోతే రేపటికి వాయిదా పడే అవకాశం

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి15(నమస్తే తెలంగాణ): మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలకమైన చైర్మన్‌, వైస్‌ చైర్మర్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం 11గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా గెలుపొందిన నల్లగొండ కార్పొరేటర్లతో, మిగతా మున్సిపాలిటీల్లో విజేతలుగా నిలిచిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. అది పూర్తయ్యాక వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగుతుంది. ఈ రెండు ఎన్నికలు కూడా సభ్యులు చేతులెత్తే పద్ధతిలోనే నిర్వహిస్తారు. ఒక వేళ ఎన్నిక నిర్వహణకు అవసరమైన కోరం లేకపోతే ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా ఎన్నికకు అవసరమైన కోరం లేకపోతే ఎన్నికల సంఘానికి నివేదించి తదుపరి ఉత్తర్వుల ప్రకారం మరో తేదీ ప్రకటిస్తారు. అయితే ప్రస్తుత ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిస్థితిని బట్టి దాదాపుగా నేడు అన్ని చోట్లా చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక పూర్తికానున్నట్లు స్పష్టమవుతోంది.

నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించి నల్లగొండ కార్పొరేషన్‌లో 48డివిజన్ల కార్పొరేటర్లతో పాటు మున్సిపాలిటీల్లోని మొత్తం 359 కౌన్సిలర్ల స్థానాల ఎన్నికలు పూర్తయి విజేతలెవరో తేలింది. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ 261 స్థానాలను, బీఆర్‌ఎస్‌ 91 స్థానాలను, బీజేపీ 19 స్థానాలను గెలుపొందగా ఇతరులు 36 స్థానాల్లో గెలిచారు. వీరిలో నుంచే మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. అన్ని చోట్లా ఆయా మున్సిపల్‌ కౌన్సిల్‌ హాళ్లలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల వరకు గెలుపొందిన సభ్యులంతా రావాలని, అనంతరం 11గంటల నుంచి సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. సభ్యులు నమోదు చేసుకున్న పేర్లలోని అక్షరాల క్రమ సంఖ్య ప్రకారంగా పార్టీలకు అతీతంగా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

అనంతరం చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. చైర్మన్‌ ఎన్నిక కోసం ఆయా మున్సిపాలిటీల్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికి ఒకరు ఎక్కువగా ఉంటే కోరం ఉన్నట్లుగా భావిస్తారు. కోరం ఉంటే చేతులెత్తే పద్ధతిలో చైర్మన్‌ ఎన్నికను పూర్తి చేస్తారు. తర్వాత వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కూడా ఇలాగే కొనసాగుతుంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. వీరంతా ఎన్నికలో పాల్గొనడంతో పాటు తాము ఎంపిక చేసిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల ఎన్నిక సజావుగా జరిగేలా ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. నేటి ఎన్నిక సందర్భంగా మున్సిపల్‌ కౌన్సిల్‌హాల్స్‌ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

చైర్మన్‌ అభ్యర్థులపై పలుచోట్ల సస్పెన్స్‌..
నల్లగొండలో మేయర్‌గా బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి పేరును ముందేగానే ఖరారు చేయగా డిప్యూటీ మేయర్‌పై స్పష్టత రావాల్సి ఉంది. మిర్యాలగూడలో మాత్రం చైర్మన్‌ అభ్యర్థిపై రాత్రివరకు సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. నూకల కవితా వేణుగోపాల్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నా గడిపాటి శీరిషా నవీన్‌ కూడా పోటీపడుతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడా చైర్మన్‌పై స్పష్టత వస్తేనే వైస్‌ చైర్మన్‌ తేలనుంది. చైర్మన్‌ అభ్యర్థిని నేడు నేరుగా సీల్డు కవర్‌ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. దేవరకొండలో చైర్మన్‌గా పున్నా శైలజా వెంకటేష్‌, వైస్‌ చైర్మన్‌గా ఎండీ యూనస్‌ను ఖరారు చేశారు. చండూరులో చైర్మన్‌గా కోడి శ్రీనివాసులు, వైస్‌ చైర్మన్‌గా బూతరాజు దశరథ, హాలియాలో చైర్మన్‌గా చింతల చంద్రారెడ్డి, చిట్యాలలో చైర్‌ పర్సన్‌గా పందిరి గీతారమేష్‌ చైర్మన్‌ అభ్యర్థులు ఫైనల్‌ అయ్యారు. ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయిన నందికొండలో కూడా సస్పెన్స్‌ కొనసాగుతోంది. మానస స్వర్ణ, మందా గీత మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తెలిసింది. సూర్యాపేటలో చైర్మన్‌గా ముందే మొరిశెట్టి నివేదితా లక్ష్యాదిని ప్రకటించగా వైస్‌ చైర్మన్‌పై స్పష్టత లేదు.

నేరేడుచర్లలో చైర్మన్‌గా కొణతం చిన్నవెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా నూకల సందీప్‌రెడ్డిని ఖరారు చేసినట్లు సమాచారం. కోదాడలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లపై ఉత్కంఠత కొనసాగుతోంది. సీల్డు కవర్‌లో పంపిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కౌన్సిలర్లకు సూచించినట్లు తెలిసింది. హుజూర్‌నగర్‌లోనూ రాత్రి వరకు స్పష్టత లేదు. ఇక్కడా సీల్డు కవర్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఎన్నిక కానున్నారు. ఇక జిల్లాలో బీఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజార్టీతో దక్కించుకున్న ఏకైక మున్సిపాలిటీ తిర్మలగిరిలో ముందుగా ఎంపిక చేసిన సంకేపల్లి రఘునందన్‌రెడ్డినే నేడు చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైస్‌ చైర్మన్‌పై స్పష్టత రావాల్సి ఉంది. ఇక భువనగిరి, చౌటుప్పల్‌లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లపై రాత్రి వరకు స్పష్టత రాలేదు. ఇక్కడ సీల్డ్‌ కవర్‌ విధానాన్ని పాటించనున్నట్లు తెలిసింది. మోత్కూర్‌ చైర్మన్‌గా గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్‌ చైర్మన్‌గా పల్లెర్ల వెంకన్నను ఎంపిక చేశారు. ఆలేరులో చైర్మన్‌గా బీజన బాలమణి ఫైనల్‌ కాగా వైస్‌ చైర్మన్‌పై స్పష్టత రావాల్సి ఉంది. ఇక యాదగిరిగుట్టలో చైర్మన్‌గా గుండ్లపల్లి వాణీ భరత్‌గౌడ్‌ను ఎంపిక చేయగా వైస్‌ చైర్మన్‌పై రాత్రి వరకు స్పష్టత రాలేదు. పోచంపల్లిలో చైర్మన్‌గా తడక వెంకటేశ్వర్లు ఫైనల్‌ కాగా వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిని తేల్చలేదు. దాదాపు అన్నిచోట్లా రేపు ఉదయానికి స్పష్టత రావచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0