నిండు కుండ

Feb 18, 2026 - 19:29
 0  0
నిండు కుండ
Well Water

అదొక మారుమూల పల్లెటూరు. ఆ ఊరి నడిమధ్యన చేద బావి ఉంది. ఊర్లో వాళ్లందరూ ఆ చేదబావి దగ్గరకు వెళ్లి కావలసినన్ని నీళ్లు తోడుకుని వస్తారు. ఆ బావి నీళ్లు చాలా రుచిగా ఉంటాయని పక్క ఊరి వాళ్లు కూడా వచ్చి తోడుకుని వెళ్తారు. ఒకరోజు పక్క ఊరికి చెందిన తల్లీకూతురు బిందెలు తీసుకుని బావి వద్దకు వెళ్లారు. నీళ్లు తోడుతూ తల్లి ఇలా చెప్పింది ‘పెండ్లీడుకు వచ్చావు. రేపోమాపో నీకు పెండ్లి చేస్తాము. నువ్వు అత్తగారి ఇంటిలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఎలాంటి పరిస్థితులలోనూ అమ్మగారి ఇంటిని ఎక్కువ చేసి, అత్తగారి ఇంటిని తక్కువ చేసి మాట్లాడవద్దు’ అని చెప్పింది.

‘అంటే ఎలా ఉండాల’ని అడిగింది కూతురు. నిండుకుండలా ఉండాలని బదులిచ్చింది తల్లి. ‘అర్థమయ్యేలా చెప్పు’ అని కోరింది కూతురు. సమయం వచ్చినప్పుడు చెబుతానని సమాధానమిచ్చింది తల్లి. తల్లి తన బిందెలో నీళ్లను నిండుగా తోడింది. కూతురి బిందెలో తక్కువ నీళ్లు తోడింది. ఇద్దరూ బిందెలను ఎత్తుకుని మంచీచెడ్డా మాట్లాడుకుంటూ ఇంటికి చేరారు. వంట గదిలో నీళ్ల బిందె దించుతూ కూతురు ఏడుపు ముఖం పెట్టి ‘నీ దుస్తులు తడవలేదు, నా దుస్తులు తడిచిపోయాయి’ అని తన తడి వస్ర్తాలు చూపింది.

తల్లి చిన్న నవ్వు నవ్వుతూ ‘ఎందుకంటే నా బిందెలో నీళ్లు నిండుగా ఉన్నాయి కాబట్టి నీళ్లు నాపైన ఒలకలేదు. నీ బిందెలో నీళ్లు నిండుగా లేవు కాబట్టి నీళ్లు ఒలికాయి. అందుకే పెద్దవాళ్లు నిండు కుండ తొణకదు అని అంటారు. గుణవంతులు, తెలివైన వాళ్లు హంగు ఆర్భాటాలకు వెళ్లరు. మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లే ఎగిరెగిరి పడతారు. నెత్తిమీదికి తెచ్చుకుంటారు. అందుకే నువ్వు అత్తగారింట్లో ఒద్దికగా ఉండు’ అని హితవు చెప్పింది. ‘నిజమే… మనం బాగా గమనిస్తే నిండు కుండ మోగదు, ఖాళీ కుండే ఎక్కువ మోగుతుంది అనే విషయం స్ఫురిస్తుందని’ తెలుసుకుంది కూతురు.

.-ఆర్సీ కృష్ణస్వామి రాజు  ,93936 62821

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0