Rajasthan | పెళ్లైన 58 ఏళ్లకు విడాకులు కోరిన వృద్ధ దంపతులు.. నిరాకరించిన కోర్టు.. కారణం ఇదే

Feb 18, 2026 - 19:30
 0  0
Rajasthan | పెళ్లైన 58 ఏళ్లకు విడాకులు కోరిన వృద్ధ దంపతులు.. నిరాకరించిన కోర్టు.. కారణం ఇదే
Rajasthan High Court

Rajasthan : సాధారణంగా ఎవరైనా దంపతులు పెళ్లైన ఏడాది, రెండేళ్లు, ఐదేళ్లు, పది, ఇరవై ఏళ్లకు విడాకులు తీసుకుంటారు. అంతకుమించి కలిసే ఉంటే ఇక వారి మధ్య విడాకుల ప్రస్తావనే రాదు. అలాంటిది పెళ్లైన 46 ఏళ్లకు, పిల్లలు కూడా పెద్దవాళ్లైన తర్వాత ఒక జంట విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అదీ 2014లో. ఇప్పటికి వారి వివాహమై 58 ఏళ్లు. ఇప్పుడు కూడా అదే విడాకుల కేసు కోర్టులో ఉంది. ఇంకా కలిసిపోకుండా విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, వివాహమైన 58 ఏళ్ల తర్వాత ఈ జంట కోరుకుంటున్నట్లుగా విడాకులు ఇచ్చేందుకు రాజస్థాన్ హైకోర్టు నిరాకరించింది.

దంపతుల పేర్లు వెల్లడికానప్పటికీ రాజస్థాన్‌కు చెందిన ఒక జంట జూన్ 29, 1967లో పెళ్లి చేసుకుంది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. 46 ఏళ్లపాటు కలిసే ఉన్నారు. ఈ మధ్యలో చిన్నచిన్న తగాదాలు సహజమే. కానీ, 2013లో మాత్రం వీరి మధ్య అనేక విబేధాలు తలెత్తాయి. దీంతో వివాహమైన 47 ఏళ్లకు.. అంటే మే 26, 2014లో వీరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లోనే భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను భరత్‌పూర్ ఫ్యామిలీ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆయన తిరిగి రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఇంతకాలం ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. తాజాగా జస్టిస్ సుదేశ్ బన్సల్, జస్టిస్ అనిల్ కుమార్ ఉప్మన్‌తో కూడిన హైకోర్టు బెంచ్ వీరి విడాకులపై విచారణ జరిపింది. విడాకులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి కేసు విచారణ వివరాల్ని కోర్టు వెల్లడించింది.

తమ పేరు మీద ఉన్న ఆస్తిని తన పెద్ద కొడుక్కు ఇవ్వాలని భార్య నిర్ణయించుకుంది. అయితే, ఇద్దరు కొడుకులకు సమానంగా ఇవ్వాలని భర్త అన్నారు. దీంతో ఈ అంశంపై ఇద్దరిమధ్యా బేధాభిప్రాయాలున్నాయి. తమ ఆస్తిని భర్త విడదీయాలనుకుంటున్నారని భార్య ఆరోపించింది. అలాగే, తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఒకసారి ఆమెను తమ ఇంటికే తీసుకొచ్చాడని కూడా భార్య ఆరోపించింది. ఇదే సమయంలో తన భార్య తనను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇవన్నీ విన్న ధర్మాసనం ఇవేమీ విడాకులు తీసుకోవడానికి తగిన కారణాలుగా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఏవో కుటుంబ కలహాల కారణంగా ఒక జంటకు విడాకులు ఇవ్వలేమని, ఈ కారణాలు సరిపోవని వ్యాఖ్యానించింది.

ఇన్నేళ్లుగా కలిసున్న ఈ జంట ఒకరినొకరు అర్థం చేసుకున్నారని, వారి మధ్య సహనం, అవగాహన ఉందని కోర్టు భావించింది. అందువల్ల ఈ చిన్న కారణాలకు 58 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు ఇవ్వలేమని చెప్పిన హైకోర్టు విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0