KCR birthday | రేపు ఘనంగా కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు : తలసాని సాయికిరణ్‌

Feb 18, 2026 - 19:29
 0  0
KCR birthday | రేపు ఘనంగా కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు : తలసాని సాయికిరణ్‌
Thalasani Saikiran Yadav

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే రోజు కేసీఆర్ పుట్టిన రోజు అని
బీఆర్‌ఎస్ నేత తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ అన్నారు. ఆయన గాంధేయ మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని
సాధించిన నాయకుడని కొనియాడారు. తెలంగాణభవన్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన
మాట్లాడుతూ.. తెచ్చిన తెలంగాణను పదేండ్లలో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళిన నాయకుడు
కేసీఆర్ అని చెప్పారు.

జాతిపితగా కేసీఆర్‌ను గౌరవవిస్తారని, రేపు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ పుట్టినరోజు ఘనంగా జరుపుతున్నామని తలసాని సాయికిరణ్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావుతోపాటుగా
తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర సీనియర్ నేతలు అందరూ పాల్గొంటారని చెప్పారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ఉంటాయన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా 72 కిలోల కేక్ కటింగ్ ఉంటుందని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రావణ కాష్టంగా మారిందని సాయికిరణ్‌ అన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్‌ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. మున్సిపాలిటీ
ఎన్నికలకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేసిన దాఖలాలు లేవని అన్నారు. ముఖ్యమంత్రి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీకి 42 శాతం ఓటు షేర్ వచ్చిందని చెప్పారు. రేవంత్‌ రెడ్డి ఆయన జీవిత కాలంలో మళ్ళీ
ముఖ్యమంత్రి కాలేడని అన్నారు.

రౌడీయిజం ఎన్నో ఏండ్లు సాగదని వ్యాఖ్యానించారు. పదేండ్లు బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలా తాము కూడా వ్యవహరిస్తే ఆ పార్టీ ఉండేదే కాదన్నారు. కేసీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన ఆయన పవర్‌ తగ్గదని, ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటారని అన్నారు. గాంధేయ మార్గంలో ఉద్యమం ఎలా చెయ్యాలో కేసీఆర్‌ తమకు నేర్పించారని చెప్పారు. ఉద్యమాలు తమకు కొత్తకాదని, తమ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామని అన్నారు.

తెలంగాణ భవన్‌లో డప్పు వాయిద్యాలతో కోలాహాలంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుగుతాయని తలసాని సాయికిరణ్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో స్థానికంగా తమ కార్యక్రమాలు ముగించుకొని తెలంగాణ భవన్‌కు రావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కిషోర్ గౌడ్, లక్ష్మణ్ మురిశెట్టి, రవినాయక్ పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0