మాట జారి..నాలుక మడతేసి

Feb 18, 2026 - 19:29
 0  0
మాట జారి..నాలుక మడతేసి
Revanth Reddy
  • ‘నేనే రాజు..నేనే మంత్రి’నంటూ ఢిల్లీలో రేవంత్‌ ప్రకటన
  • సీఎం, మున్సిపల్‌ మంత్రిని కాబట్టి అన్నానని బుకాయింపు
  • స్వపక్షం నుంచి ఊహించని ఎదురుదాడితో కంగుతిన్న సీఎం
  • మొన్న రంజిత్‌రెడ్డిని మంత్రిని చేస్తానని ప్రకటించిన రేవంత్‌
  • ఆనక తన మాటలు మీడియా అర్థం చేసుకోలేదని వివరణ
  • భూపాలపల్లి సభలో నిధులు శ్రీధర్‌బాబు ఇస్తారని వ్యాఖ్యలు
  • ఈ మాటలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వని సీఎం రేవంత్‌రెడ్డి
  • ఆ వ్యాఖ్యలు భట్టి శాఖల్లో కోతకేనని హస్తం శ్రేణుల్లో చర్చ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : వెనుకాముందు ఆలోచన లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం.. ప్రతిఘటన ఎదురైతే నాలుక మడతేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని కాంగ్రెస్‌ శ్రేణులే చెప్తున్నాయి. ‘తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి’ అని రేవంత్‌రెడ్డి ఢిల్లీలో చేసుకున్న స్వయం ప్రకటనపై స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తడంతో రేవంత్‌ నాలుక మడతేశారు. ‘నా వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని’ అని తాజాగా బుకాయించారు.

అంతుకు ముందు పరిగి సభలోనూ రంజిత్‌రెడ్డిని మున్సిపల్‌ శాఖ మంత్రిని చేస్తానని ప్రకటించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నోరు పెద్దగ చెయ్యగానే..‘అబ్బే.. నా మాటలు మీడియా అర్థం చేసుకోలేదు’ అని వివరణ ఇచ్చారు. భూపాలపల్లిలోనూ ‘సంతకం పెట్టేది నేను.. నిధులు ఇచ్చేది శ్రీధర్‌బాబు.. పని చేయించుకునేది గండ్ర సత్యనారాయణ’ అని చెప్పడంతో కాబోయే ఆర్థిక మంత్రి శ్రీధర్‌బాబు అని కాంగ్రెస్‌ శ్రేణుల్లో చర్చ మొదలైంది. దీనిపై సీఎం నుంచి స్పందన రాలేదు.

నేను ఆ ఉద్దేశంతోనే అన్నా..

ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌ రెడ్డి ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని వ్యాఖ్యలు చేయడంపై అధికారం పక్షం నుంచే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తమను అసమర్థులుగా చిత్రీకరించడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అంటూ సహచర మంత్రులు కొందరు సీఎంను కలిసి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు రేవంత్‌రెడ్డి తీరు ఉన్నదని, రేవంత్‌రెడ్డివి అహంకారపూరిత మాటలు అని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియా ఎదుట మండిపడ్డారు. మరోవైపు అధికార అహంకారం పెరగడంవల్లే రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి.

తన వ్యాఖ్యలపై ఎదురుదాడితో కంగుతిన్న రేవంత్‌ ఆత్మరక్షణలో పడ్డట్టు కాంగ్రెస్‌ శ్రేణులు చెప్తున్నాయి. నష్టనివారణ చర్యలకు ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని రేవంత్‌ వేదికగా చేసుకున్నారు. తన మాటలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని వివరణ ఇచ్చారు. ‘నేనే రాజు, నేనే మంత్రి’ అనే వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం బాధ్యతను స్వీకరించడమే తప్ప అహంకారం కాదు’ అంటూ చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మున్సిపల్‌ పరిపాలన శాఖ కూడా పర్యవేక్షిస్తున్నందున, రాబోయే ఎన్నికల ఫలితాలకు తానే పూర్తి జవాబుదారీ అని చెప్పే క్రమంలో ఆ పదాన్ని ఉపయోగించినట్టు కథ అల్లారు. రాజ్యాంగబద్ధమైన పదవుల రీత్యా ఆ వ్యాఖ్యలు చేశానని, తప్పుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరడం కొసమెరుపు.

రంజిత్‌రెడ్డిని మంత్రిని చేస్తా అనలే

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రంజిత్‌రెడ్డికి మున్సిపల్‌ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తామని ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి రంజిత్‌రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. ‘ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపునుంచి మీకు అండగా రంజిత్‌రెడ్డి నిలబడుతడు.. మీరంతా కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకోండి’ అని రేవంత్‌ సూచించారు.

దీంతో మంత్రివర్గం బెర్త్‌ మీద మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. దీంతో రాజగోపాల్‌రెడ్డి సీఎంపై ప్రత్యక్ష దాడికి దిగారు. ‘తెలంగాణలో అధికారంలో ఉన్నది రేవంత్‌ కాంగ్రెస్సా? రాహుల్‌ కాంగ్రెస్సా?’ అంటూ నిలదీశారు. ‘ఆయన ఆహంకార పూరిత మాటలు రాహుల్‌గాంధీని అవమానించడమే’ అని మండిపడ్డారు.

మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఫీల్డ్‌ మీదికి వచ్చి ‘రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గమే అడ్డు అనుకుంటే నేను రాజీనామా చేసి, మీరు కోరిన సామాజిక వర్గం నేతను నిలబెట్టి గెలిపిస్తా’నని ప్రకటించారు. వారి మాటలతో ఆందోళన చెందిన సీఎం మీడియాను పిలిచి మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డిని మంత్రిని చేస్తానని ఎకడా చెప్పలేదని వివరణ ఇచ్చారు. మున్సిపల్‌ శాఖ మంత్రిగా నిధులిచ్చి అభివృద్ధి చేసే బాధ్యతను రంజిత్‌రెడ్డికి ఇస్తానని తాను పరిగి సభలో చెప్పినట్టు సంజాయిషీ ఇచ్చారు.

నిధులు శ్రీధర్‌బాబు ఇస్తారు

భూపాలపల్లి సభలో కూడా ‘నేను సంతకం చేస్తే.. శ్రీధర్‌బాబు నిధులు ఇస్తారు.. మాతో ప్రజలు పని చేయించుకోవాలి’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్‌ అనుకూల సోషల్‌ మీడియా పోస్టింగ్‌ పెట్టింది. నైని బొగ్గు గనుల కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో భట్టి శాఖల్లో మార్పులు చేర్పులు చేసి, ఆర్థిక శాఖను మంత్రి శ్రీధర్‌ బాబుకు అప్పగిస్తారని కాంగ్రెస్‌ శ్రేణుల్లో చర్చ. సీఎం వివరణ ఇస్తారా? జరగబోయే విషయాన్నే తేల్చి చెప్పారా? అనేది కాలమే తేల్చాలని అధికార పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0