పరిశ్రమలకు పవర్‌ హాలిడే!.. పారిశ్రామికవాడల్లో నిత్యం విద్యుత్తు కోతలు

Feb 18, 2026 - 19:29
 0  0
పరిశ్రమలకు పవర్‌ హాలిడే!.. పారిశ్రామికవాడల్లో నిత్యం విద్యుత్తు కోతలు
Electricity Problems
  • ముందస్తు సమాచారం ఇవ్వకుండా కరెంటు కట్‌
  • ఉత్పత్తులపై తీవ్ర ప్రతికూల ప్రభావం
  • ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈసారి వేసవి మొదలు కాకముందే పరిశ్రమలకు కరెంటు కష్టాలు మొదలయ్యాయి. నిత్యం అప్రకటిత కరెంటు కోతలతో హైదరాబాద్‌ శివార్లలోని పారిశ్రామికవాడల్లో ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. మెయింటెనెన్స్‌ పనుల పేరుతో ఇప్పటికే ప్రతి ఆదివారం విద్యుత్తు కోతలు విధిస్తున్న అధికారులు.. వారంలో మిగిలిన రోజుల్లో సైతం అకారణంగా కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో ఎప్పుడు కరెంటు పోతుందో అర్థంకాక పరిశ్రమల నిర్వాహకులు సతమతమవుతున్నారు. నాణ్యమైన కరెంటు సరఫరా కోసం ప్రతి ఆదివారం పారిశ్రామికవాడల్లో విద్యుత్తు శాఖ సిబ్బంది నిర్వహణ పనులు చేపట్టడం ఆనవాయితీ.

అది సెలవుదినం కావడంతో ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు వచ్చినప్పటినుంచి ఈ విధానం గాడితప్పింది. నిర్వహణ పనులు తూతూమంత్రంగా చేస్తుండటంతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మరమ్మతుల పేరిట ఇంచుమించు ప్రతి రోజూ విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారు. అలా గత వారం రోజుల్లో జీడిమెట్లలో రెండుసార్లు గంట చొప్పున కరెంటు పోయింది. చర్లపల్లి, బాలానగర్‌, నాచారంలో మూడుసార్లు, మల్లాపూర్‌, ఉప్పల్‌ పారిశ్రామికవాడల్లో ఒకసారి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

పాడవుతున్న యంత్రాలు, ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం

ముందస్తు సమాచారం లేకుండా కరెంటు నిలిపివేస్తుండటంతో యంత్రాలు పాడవుతున్నాయని, మోటర్లు కాలిపోయే ప్రమాదం ఉన్నదని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. యంత్రాలు నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా కరెంటు సరఫరా నిలిచిపోతే ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతుందని, ముఖ్యంగా ప్లాస్టిక్‌ పరిశ్రమల్లో ప్లాస్టిక్‌ గడ్డకట్టి వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల్లో బాయిలర్లు చల్లారిపోయి మళ్లీ వేడెక్కేందుకు ఎంతో సమయం పడుతుందని, కనీసం అర్ధగంట సేపు విద్యుత్తు నిలిచిపోయినా.. మళ్లీ ఉత్పత్తి మొదలయ్యేందుకు రెండు గంటల సమయం పడుతుందని చెప్తున్నారు.

వాస్తవానికి ఈ ఏడాది భారీ వర్షాల వల్ల జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లోనూ నిత్యం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఏదో ఒక ప్రాంతంలో చెట్లు కూలడం, కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు నష్టం జరగడం వంటి ఘటనలతో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక కరెంటు సరఫరా కాస్త గాడిలో పడినప్పటికీ గత నెలరోజులుగా మళ్లీ విద్యుత్తు కోతలు మొదలయ్యాయి.

విద్యుత్తు పరికరాల కొరత

రాష్ట్ర విద్యుత్తు శాఖ ఇప్పటికే పరికరాల కొరతతో సతమతమవుతున్నట్టు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి విద్యుత్తు సరఫరా నియంత్రణ, క్రమబద్ధీకరణ లాంటి పనుల కోసం ఉపయోగించే ఆల్టర్నేటింగ్‌ కరెంట్‌ (ఏసీ), డైరెక్టర్‌ కరెంట్‌ (డీసీ) రెక్టిఫయర్లు, ఫిల్టర్లు, ఓల్టేజ్‌ రెగ్యులేటర్లు తదితర పరికరాలు లేక పాత పరికరాలనే కొనసాగిస్తుండటంతో రోజూ మరమ్మతులు తప్పడం లేదు. దీంతో విద్యుత్తు సరఫరా సక్రమంగా సాగడంలేదు.

మళ్లీ పాత రోజులు

స్వరాష్ట్ర ఆవిర్భావానికి ముందు నిత్యం కరెంటు కోతలతో తెలంగాణ తీవ్రంగా సతమతమైంది. ముఖ్యంగా వేసవి కాలంలో వారానికి 2-3 రోజులు అధికారికంగానే పవర్‌ హాలిడేలు ఉండేవి. పగటిపూట కరెంటు కోతలు విధించి, రాత్రి వేళల్లో మాత్రమే విద్యుత్తు సరఫరా చేసేవారు. దీంతో ప్రతి పరిశ్రమ తప్పనిసరిగా జనరేటర్లను ఏర్పాటు చేసుకునేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఆ కష్టాలకు తెరదించి, పదేండ్లపాటు కరెంటు కోతలు లేకుండా చేయడంతో పరిశ్రమల్లో జనరేటర్లు కనుమరుగయ్యాయి. కానీ, ప్రస్తుత కరెంటు కోతలు చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి. దీంతో తాము మళ్లీ జనరేటర్లను ఏర్పాటు చేసుకోక తప్పదని పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0