Oranges | నారింజ పండ్ల‌ను నిల్వ చేస్తున్నారా..? పాడ‌వ‌కుండా ఉండాలంటే ఇలా చేయండి..!

Feb 18, 2026 - 19:30
 0  0
Oranges | నారింజ పండ్ల‌ను నిల్వ చేస్తున్నారా..? పాడ‌వ‌కుండా ఉండాలంటే ఇలా చేయండి..!
Oranges

Oranges | మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్ల‌ల్లో నారింజ పండు ఒక‌టి. వీటిలో విట‌మిన్ సితో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పిల్ల‌లు కూడా వీటిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ఇవి మ‌నకు త‌క్కువ ధ‌ర‌లోనే ల‌భిస్తూ ఉంటాయి. క‌నుక వీటిని ఎక్కువ మొత్తంలో వారానికి స‌రిప‌డా కొనుగోలు చేసి నిల్వ చేస్తూ ఉంటారు. అయితే నారింజ పండ్ల‌ను నిల్వ చేయ‌డం చాలా సుల‌భం అనుకుంటూ ఉంటారు. చాలా మంది వీటిని బ‌య‌టే ఉంచి నిల్వ చేస్తూ ఉంటారు. కానీ అవి కొన్నిసార్లు మ‌నం తిన‌క‌ముందే చెడిపోతూ ఉంటాయి. వీటిలో నీటిశాతం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక మెత్త‌గా అవ్వ‌డం, పండ్ల నుండి నీరు కార‌డం వంటివి జ‌రుగుతూ ఉంటాయి. కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల నారింజ పండ్లు పాడ‌వ‌కుండా ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకోవ‌చ్చు. నారింజ పండ్ల‌ను నిల్వ చేసే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నీటితో క‌డ‌గ‌వ‌ద్దు..

నారింజ పండ్ల‌ను ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌చ్చు. ఫ్రిజ్ లో ఉంచ‌డం వల్ల ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్ లో ఉండే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు నారింజ పండ్లు పాడ‌వ్వ‌డాన్ని నెమ్మ‌దిస్తాయి. ఫ్రిజ్ లో ఉంచ‌డం వ‌ల్ల నారింజ పండ్లు పాడ‌వ‌కుండా, తాజాగా, జ్యూసీగా ఉంటాయి. అలాగే వీటిని నిల్వ చేసే ముందు నీటితో క‌డ‌గ‌కూడ‌దు. నీటితో క‌డ‌గ‌డం వ‌ల్ల వాటిపై ఉండే తేమ కార‌ణంగా బూజు ప‌ట్టే అవ‌కాశం ఉంది. క‌నుక నారింజ పండ్ల‌ను తినే ముందే క‌డుక్కోవ‌డం మంచిది. అలాగే వీటిని ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయ‌కూడ‌దు. మెష్, కాట‌న్ బ్యాగ్ లేదా రంధ్రాలు ఉన్న బ్యాగుల్లో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గాలి త‌గిలి నారింజ‌లు పాడ‌వ‌కుండా ఉంటాయి.

ఎండ, వేడి త‌గ‌ల‌వ‌ద్దు..

అదే విధంగా వీటిని ఘాటైన వాస‌న‌లు వ‌చ్చే ఆహార ప‌దార్థాల నుండి దూరంగా ఉంచాలి. వీటిని ఫ్రిజ్ లో ప్ర‌త్యేక కంటైన‌ర్ లో ఉంచి నిల్వ చేయాలి. వీటిని ఫ్రిజ్ లో నిల్వ చేసిన‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు త‌నిఖీ చేస్తూ ఉండాలి. మెత్త‌గా, బూజు ప‌ట్టిన‌ట్టు క‌నిపించిన పండ్ల‌ను వేరు చేయాలి. పాడైన పండ్ల వ‌ల్ల ఇత‌ర పండ్లు పాడ‌య్యే అవ‌కాశం ఉంది. అలాగే నారింజ పండ్ల‌ను నిల్వ చేసే ముందు కంటైన‌ర్ లో అడుగున కాగిత‌పు ట‌వ‌ల్ ను వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అద‌నంగా ఉండే తేమ గ్ర‌హించ‌బ‌డుతుంది. ఒక‌వేళ వీటిని ఫ్రిజ్ లో ఉంచ‌క‌పోతే గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేయ‌డం వ‌ల్ల ఒక వారంపాటు పాడ‌వ‌కుండా ఉంటాయి. వేడి, ఎండ త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి.

ఈ పండ్ల‌తో క‌ల‌ప‌కూడ‌దు..

అలాగే వీటిని ఎత్తుగా పేర్చి నిల్వ చేయ‌కూడ‌దు. ఒకేపొర వ‌చ్చేట‌ట్టు నిల్వ చేసుకోవాలి లేదా గాలి త‌గిలేలా చిన్న కుప్పలాగా నిల్వ చేసుకోవాలి. ఇక వీటిని అర‌టి పండ్లు, ఆపిల్స్ తో క‌లిపి నిల్వ చేసుకోకూడ‌దు. ఇవి ఇథ‌నాల్ ను విడుద‌ల చేస్తాయి. దీంతో నారింజ పండ్లు త్వ‌ర‌గా పాడైపోయే అవ‌కాశం ఉంది. క‌నుక వీటిని వేరుగా నిల్వ చేయ‌డం మంచిది. ఇక ఎక్కువ మొత్తంలో నారింజ పండ్లు ఉన్న‌ప్పుడు వాటిని తొక్క తీసి గాలి చొర‌బ‌డ‌ని కంటైన‌ర్ లో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుని జ్యూస్, స్మూతీ, డెజ‌ర్ట్ వంటి వాటి కోసం ఉప‌యోగించుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నారింజ పండ్లు పాడ‌వ‌కుండా ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకోవ‌చ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0