Jana Nayagan | ‘జన నాయగన్’ విడుదలపై అనిశ్చితి .. కోర్టు, సెన్సార్ అడ్డంకులతో విజయ్ చివరి చిత్రం ఆలస్యం

Feb 18, 2026 - 19:30
 0  0
Jana Nayagan | ‘జన నాయగన్’ విడుదలపై అనిశ్చితి .. కోర్టు, సెన్సార్ అడ్డంకులతో విజయ్ చివరి చిత్రం ఆలస్యం
Jana

Jana Nayagan | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ జన నాయగన్ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయ నేపథ్యం, సామాజిక అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్. వినోద్ రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, హీరోయిన్‌గా పూజా హెగ్డే, కీలక పాత్రలో మమితా బైజు కనిపించనున్నారు. సంగీతాన్ని యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సమకూర్చడం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా మారింది.

మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, సెన్సార్ ప్రక్రియలో తలెత్తిన సమస్యలతో రిలీజ్ వాయిదా పడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మత విభేదాలకు దారితీసే అంశాలు, భద్రతా దళాలు మరియు విదేశీ శక్తుల ప్రస్తావనపై స్పష్టత అవసరమని సూచించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమాను రివైజింగ్ కమిటీకి పంపినా ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది. దీంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టు ను ఆశ్రయించారు. తొలుత సింగిల్ బెంచ్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించినప్పటికీ, ఆ తీర్పును సవాల్ చేస్తూ CBFC డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అనంతరం డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేసి, పూర్తి వాదనలు వినాలంటూ కేసును మళ్లీ పునర్విచారణకు పంపింది. దీంతో సినిమా విడుదల పూర్తిగా సందిగ్ధంలో పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో కెనడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ యార్క్ సినిమాస్ విడుదల చేసిన ప్రకటన మరోసారి చర్చనీయాంశమైంది. తమ అధికారిక ప్రకటనలో “జన నాయగన్ చిత్రం ఏప్రిల్ 30కు ముందు విడుదల కానుందని ఆశించవద్దు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు రిఫండ్ కోసం థియేటర్లను సంప్రదించవచ్చు” అని పేర్కొనడం అభిమానుల్లో నిరాశను కలిగించింది. దీంతో ఫిబ్రవరి విడుదల ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. ప్రస్తుతం ఈ సినిమా వేసవి కానుకగా మే నెలలో విడుదలయ్యే అవకాశాలపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అదే సమయంలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విడుదల మరింత ఆలస్యం కావచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, సెన్సార్ సూచనలకు అనుగుణంగా దాదాపు 15–20 నిమిషాల ఫుటేజ్ తొలగించడం, కొన్ని డైలాగ్‌లను సవరించడం వంటి మార్పులతో కొత్త వెర్షన్‌ను మళ్లీ సమర్పించినట్లు టాక్ వినిపిస్తోంది. కొత్త అభ్యంతరాలు లేకుండా క్లియరెన్స్ లభిస్తే, కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. మొత్తానికి ‘జన నాయగన్’ విడుదల ఎప్పుడు అన్నదానిపై స్పష్టత రాకపోయినా, కోర్టు తీర్పు మరియు సెన్సార్ క్లియరెన్స్ ఆధారంగానే తుది నిర్ణయం వెలువడనుంది. విజయ్‌ను వెండితెరపై చివరిసారిగా చూడాలనుకుంటున్న అభిమానులకు మాత్రం ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0