Harish Rao | బాల్క సుమన్‌ అరెస్టును ఖండించిన హరీష్‌రావు

Feb 18, 2026 - 19:28
 0  0
Harish Rao | బాల్క సుమన్‌ అరెస్టును ఖండించిన హరీష్‌రావు
Harish Rao 1

హైదరాబాద్‌ : క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్‌ ను అరెస్టు ( Balka Suman Arrest ) చేసి నిర్బంధించడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు.

క్యాతన్ పల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నదని అన్నారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని దుయ్యబట్టారు.

రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నది. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మురుగు రాజకీయాల వాసన కమ్ముకున్నది. హంగ్ వచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత భేరం చేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నోనని అన్నారు.

జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్‌కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని సమాజం కళ్లారా చూసిందని వెల్లడించారు. తమ కళ్ళెదుట ఒక దళిత మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడితే అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదని అన్నారు.

ఒక్క క్యాతనపల్లే కాదు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0